Breaking News
Loading...

పాలమూరు మామిడిని ఎంపిక చేసిన జాతీయ ఉద్యాన మండలి (NHB)

  • ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద మొత్తంలో మామిడి తోటల పెంపకం
  • క్లష్టర్ అభివృద్ది పథకం” (CDP) క్రింద పాలమూరు మామిడి ఎంపిక
  • పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ఉద్యాన బోర్డు
  • ఈ పథకం ద్వారా మామిడి రైతులకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు
  • మార్కెటింగ్ కోసం రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPO) ఏర్పాటు
  • దాదాపు 70 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్ లు & ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌజ్ ల నిర్మాణం

హైదరాబాద్, రైతుముచ్చట: పాలమూరు మామిడి పండ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. దేశవ్యాప్తంగా వ్యవసాయాభివృద్దికి చేపట్టిన “క్లష్టర్ అభివృద్ది పథకం” (CDP) క్రింద తెలంగాణలోపాలమూరు మామిడిని జాతీయ ఉద్యాన మండలి (NHB) ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలలో 16 జిల్లాలలో పండే పంటలను మాత్రమే ఎంపిక చేసింది. వీటిలో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరధిలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పండే మామిడిని ఎంపిక చేశారు. ఈ మామిడి తోటల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది.

క్లష్టర్ డెవలప్ మెంట్ స్కీమ్ (CDP) క్రింద మామిడి, ఆరటి, ద్రాక్ష, పైనాఫిల్, దానిమ్మ, పసుపు, ఆపిల్ ఎగుమతులను 25% శాతానికి పెంచనున్నారు. ఈ ఏడు రకాల పంటల అభివృద్ది కొరకు కేంద్ర ప్రభుత్వం 3300 కోట్లు సమకూరుస్తుంది. తెలంగాణలో ఈ పథకం అమలుకు రాష్ట్ర ఉద్యాన బోర్డు నోడల్ ఏజెన్సీగా ఉండనున్నది. ఈ 5 జిల్లాలలో పరిధిలోని 56,655 ఎకరాలలో మామిడి తోటలను సాగు చేస్తున్న 17,284 మంది మామిడి రైతులకు ఈ పథకం క్రింద రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం దాదాపు 2.29 లక్షల టన్నుల మామిడి దిగుబడి రానున్నది. మార్కెటింగ్ కోసం రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (FPO) కూడా ఏర్పాటు చేయనున్నారు. 

గద్వాల జిల్లాలో 49 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో 7 కోల్డ్ స్టోరేజ్ లను, మహబూబ్ నగర్ లో 15 వేల టన్నుల సామర్థ్యం గల 3 కోల్డ్ స్టోరేజ్ లను, నాగర కర్నూల్ లో 5 వేల టన్నుల సామర్థ్యంతో ఒక కోల్డ్ స్టోరేజ్ ను మరియు మామిడి పండ్ల శుద్ది, ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌజ్ ను నిర్మించనున్నారు. ఇందులో శీతల గదులు, కాయలను మాగబెట్టే గదులు, కాయలను ట్రీట్ మెంట్ చేసే గదులు ఉంటాయి. ఈ విధంగా క్లష్టర్ డెవలప్ మెంట్ స్కీమ్ (CDP) క్రింద మామిడి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి పాలమూరు మామిడికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకరానున్నారు.

Post a Comment

0 Comments