Breaking News
Loading...

దేశవ్యాప్తంగా కదిరి లేపాక్షి వేరుశనగ రకానికి పెరుగుతున్న డిమాండ్

తెలంగాణ, రైతుముచ్చట: వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్న తరుణంలో రాబోయే రబీ పంట కాలంలో వేరుశనగ సాగు వైపు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో కొన్ని సంవత్సరాలుగా సాగవుతున్న కదిరి-6 వేరుశనగ రకానికి బదులుగా ఇతర రకాల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం జూన్ 15, 2020 న విడుదల చేసిన కదిరి లేపాక్షి-1812 అనే వేరుశనగ రకానికి అధిక డిమాండ్ నెలకొంది. 

ముఖ్యంగా ఈ రకం ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు లాంటి చీడపీడలను సమర్థవంతంగా తట్టుకోవటమే కాకుండా, ఎకరాకు 16 నుంచి 20 క్వింటాళ్ళ దిగుబడి ఇవ్వటంతో తెలుగు రాష్ట్రాల్లోని వేరుశనగ రైతులు కదిరి లేపాక్షి రకం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. దీనితో ఈ రకం విత్తనానికి అధిక డిమాండ్ సంతరించుకుంది. 2020-21 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఉన్న 36 వేరుశనగ రకాలకు కలిపి 9 వేల క్వింటాల్ల బ్రీడర్ సీడ్ ఇండెంట్ వస్తే కేవలం ఒక్క కదిరి లేపాక్షి రకానికి మాత్రం 5 వేల క్వింటాల్ల బ్రీడర్ సీడ్ ఇండెంట్ వచ్చిందని, ఆంద్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని  కదిరి వేరుశనగ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు. గడిచిన సీజన్ లో విత్తన పంటగా ఈ రకాన్ని సాగు చేసిన రైతులు, తమకు చుట్టుపక్కల ఉండే ఇతర రైతులకు క్వింటాలు విత్తనానికి దాదాపు 12 నుండి 15 వేల వరకు అమ్ముతున్నారు.

మార్కెటింగ్ విషయంలో అపోహలు నమ్మవద్దు - కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు
ఈ రకం చేదుగా ఉంటుందని, త్వరగా ఎరుపు రంగులోకి మారుతుందని, అందువల్ల మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర లేదని, మార్కెట్ లో కొనటం లేదని దళారులు అపోహలు సృస్టిస్తున్నారని, గతంలో కదిరి-6 విడుదలైనప్పుడు కూడా ఇలాంటి సమస్యలే ఉత్పన్నమయ్యాయని, ఈ రకాన్ని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరిశోధనలు జరిపి 51% నూనె శాతాన్ని నిర్దారించామని, రైతులు ఎలాంటి అపోహాలు నమ్మవద్దని కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు.

కదిరి లేపాక్షి-1812 విశిష్టతలు:

ఖరీఫ్ & రబీ రెండు పంట కాలాలకు అనువైనది

ఎకరాకు 50 నుంచి 60 కేజీల విత్తనం సరిపోతుంది.

మొక్క వెడల్పుగా పెరుగుతుంది (స్ప్రెడింగ్ టైప్)

మొక్కకు 20 నుంచి 30 పిలకలు వస్తాయి

ఒక పిలకకు 5 నుంచి 6 కాయలు వస్తాయి

ఈ విధంగా మొక్కకు 100 నుంచి 150 కాయలు వస్తాయి

నీటి ఎద్దడిని తట్టుకుంటుంది

చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది

పురుగు మందులు & ఎరువుల ఖర్చులు తక్కువ

పంట కోత వరకు మొక్క పచ్చగా ఉంటుంది

ఎకరాకు 16 నుండి 23 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది

Post a Comment

1 Comments