Breaking News
Loading...

ఇక నుంచి రైతులకు అందుబాటులోకి నానో యూరియా

తెలంగాణ, రైతుముచ్చట: వ్యవసాయంలో ప్రస్తుతం రైతులు వాడుతున్న యూరియా వల్ల భూమి, నీరు, గాలికి అవుతున్న కలుషితాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని సంరక్షించడంలో భాగంగా భారతీయ రైతుల ఎరువుల సహకార సంస్థ (IFFCO) నానో టెక్నాలజీ ద్వారా యూరియాను కనుగొని వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా ప్రపంచంలో మొదటి సారిగా ఈ నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్ ను కూడా పొందింది. కార్పోరేట్ సంస్థల నుండి కాకుండా ప్రభుత్వ పరిధిలోని సహకార సంస్థ నుండి ఇలాంటి సరికొత్త టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి రావటం గర్వించదగ్గ విషయం.

ఈ సంధర్భంగా, హైదరాబాద్ లోని మినిష్టర్స్ క్వార్టర్స్ లో గుజరాత్ రాష్ట్రంలోని కలోల్ నుండి తెలంగాణకు బయలుదేరిన మొదటి నానో యూరియా ట్రక్ ను ఆన్ లైన్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సమావేశానికి ఇఫ్కో వైస్ చైర్మన్ దిలీప్ సంఘానీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

నానో యూరియా గురించి పెద్ద ఎత్తున రైతులకు అవగాహన కల్పించి, ఎరువుల నియంత్రణ చట్టం క్రింద ఆమోదం పొందిన ఈ నానో యూరియా క్షేత్ర స్థాయిలో రైతులకు విరివిగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులను మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.

నానో యూరియా వలన కలిగే ప్రయోజనాలు:

ప్రభుత్వాలకు సబ్సిడీ భారాన్ని, రవాణా, నిల్వ ఖర్చులు తగ్గిస్తుంది.

ఒక బస్తా మీద దాదాపు 800 నుండి1000 రూపాయాల వరకు సబ్సిడీ భారం తగ్గిస్తుంది.

కేవలం 240 కి లభించే 500 ML లిక్విడ్ బాటిల్ ఒక బస్తా యూరియాకు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది.

ఏ పంటకైనా పూతకంటే ముందు, విత్తిన 20 రోజుల తర్వాత యూరియాకు ప్రత్యామ్నాయంగా రెండు సార్లు పిచికారి చేసుకోవచ్చు.

మామూలు యూరియాకు 30 శాతం సమర్ధత ఉంటే, నానో యూరియా 80 శాతం సమర్ధంగా ఉండడంతో పాటు 8 శాతం దిగుబడి పెరుగుతుందని ICAR పరిశోధనలలో కూడా వెల్లడైంది.

ప్రస్తుతం వాడుతున్న యూరియా కన్నా తక్కువ మోతాదు, తక్కువ ధరలో ఎక్కువ ఫలితాలను నానో యూరియా ఇస్తుంది.

ఇది పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తే ప్రస్తుతం వాడుతున్న యూరియా వాడకం 50 శాతం తగ్గుతుంది.

Post a Comment

1 Comments