Breaking News
Loading...

ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతికి శ్రీకారం చుట్టిన బీఎస్సీ అగ్రికల్చర్ పట్టభద్రుడు

పాలమూరు జిల్లా నుంచి విదేశాలకు పండ్లు, కూరగాయల ఎగుమతి
మహబూబ్ నగర్, రైతుముచ్చట: రైతులు పండించిన వివిధ రకాల కూరగాయలు, పండ్లను విదేశాలకు ఎగుమతి చేయాలనే లక్ష్యంగా వనపర్తి, శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ఆనంద్ సాగర్ మహబూబ్ నగర్ జిల్లా, బాలానగర్ మండలం, చిన్నరేవల్లేలో రెండు సంవత్సరాల క్రితం “ఆన్స్ ఆగ్రోనమి ప్రైవేట్ లిమిటెడ్” అనే సంస్థను స్థాపించారు. జిల్లాలో పలు గ్రామాలలో రైతులు పండించిన మామిడి, సపోటా, జామ, జామూన్, మునగ, గోరుచిక్కుడు, చిక్కుడుకాయ, పప్పుదోసకాయ, బీరకాయ, సోరకాయ, పొట్లకాయ గోంగూర, తోటకూరనిమ్మ గడ్డిని రైతుల నుండి సేకరించి యూకే, ఫ్రాన్స్, జర్మనీ, హాలండ్, ఐర్లాండ్ దేశాలకు ఎగుమతి చేస్తూ మంచి లాభాలు పొండటమే కాకుండా, రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించేలా తోడ్పాటును అందిస్తున్నాడు. గత రెండు సంవత్సరాలుగా 120 టన్నుల మామిడిని పాలమూరు జిల్లా నుండి ఎగుమతి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరో 25 టన్నుల మామిడిని, 500 టన్నుల కూరగాయలను మరియు 100 టన్నుల ఆకుకూరలను ఎగుమతి చేయుటకు సిద్దంగా ఉన్నామని ఆనంద్ సాగర్ తెలిపారు. 

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా తాము ఎంచుకున్న కొందరి రైతు పొలాల్లోనే తమ సూచనలు & అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా తక్కువ మోతాదులో పురుగుమందులు వాడి, ఎప్పటికప్పుడు వచ్చిన పంట వచ్చినట్లు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన “పెస్టిసైడ్ ఫ్రీ” ఉద్యాన ఉత్పత్తులనే రైతుల నుండి సేకరించి ఎగుమతి చేస్తున్నామని, రైతులు సహకరిస్తే ఇంకా పెద్ద మొత్తంలో ఎగుమతులు చేయడానికి అవకాశం ఉంటుందని ఆనంద్ సాగర్ తెలిపారు.

అంతేకాకుండా రైతుల దగ్గర కొన్న పండ్లు కూరగాయలు, ఆకుకూరలను ఎగుమతులకు తగ్గట్టు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్ & ప్యాకింగ్ చేయడానికి APEDA సహకారంతో అధునాతన ప్రమాణలతో “ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్” ను కూడా చిన్నరేవల్లి గ్రామంలో నెలకొల్పారు. దీనితో దిగుమతి చేసుకుంటున్న ఆయా దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేయడానికి వీలవుతుంది.

ఈ సంధర్భంగా ఉద్యాన శాఖ కమీషనర్ & డైరెక్టర్ ఎల్ వెంకట్రామి రెడ్డిను కలిసి ఎగుమతి చేస్తున్న మామిడి పండ్లను అందెజేశాడు. మహబూబ్ నగర్ జిల్లా నుండే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యాన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఇది మంచి అవకాశం అని ఆనంద్ సాగర్ ను అభినందించాడు.

1999 లో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన ఆనంద్ సాగర్, పై చదువుల కొరకు యూ‌కే వెళ్ళి అక్కడ హార్టికల్చర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొనిఅంతర్జాతీయ ఉద్యాన వాణిజ్య వ్యాపారంలో దాదాపు 18 సంవత్సరాలు పలు పేరొందిన కంపెనీలలో పని చేశాడు. తదనంతరం తన సొంత జిల్లాకే వచ్చి “ఆన్స్ ఆగ్రోనమి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను” స్థాపించి ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులు ప్రారంభించాడు.

Post a Comment

0 Comments