Breaking News
Loading...

సేంద్రీయ సాగు ముందుకు సాగేదెలా…? వినియోగదారునికి నమ్మకం కలిగేదెలా..??

జాతీయం, రైతుముచ్చట : ఆధునిక ప్రపంచంలో రోజు రోజుకి సేంద్రీయ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రపంచ దేశాలన్నీ సేంద్రీయ వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో భాగంగా ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని సేంద్రియ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి బయటి మార్కెట్లో ఎక్కువ ధరలకు సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేయటం జరుగుతుంది. నేపథ్యంలో చాలా మంది రైతులు ఆసక్తితో సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు.

వినియోగదారునికి లోపించిన నమ్మకం :

రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నపట్టికి, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్లో సరైన నాణ్యతా గుర్తింపు విధానం లేకపోవటం వలన వినియోగదారునికి రైతు పండించిన సేంద్రీయ ఉత్పత్తులపైన సరైన నమ్మకం లేకుండా పోయింది. గతంలో వినియోగదారుడు ఎలాంటి అనుమానాలు లేకుండా తాను కొనే సేంద్రీయ ఉత్పత్తులు నాణ్యమైనవా..కావా.? అని నిర్దారించుకోకుండా కొనుగోలు చేసేవారు, కానీ కాలక్రమేణా ప్రజలకు సేంద్రియ ఉత్పత్తుల పట్ల వస్తున్న అవగాహన వల్ల సేంద్రీయ ఉత్పత్తుల నిర్దారణ విషయంలో వాటిని విక్రయించే వారిని ప్రశ్నిచడం జరుగుతుంది.

ప్రభుత్వ & ప్రైవేట్ సేంద్రీయ దృవీకరణ సంస్థలకు గుర్తింపు :

నేపథ్యంలో భారత ప్రభుత్వం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ (APEDA) ఆధ్వర్యంలో నిర్దేశించిన NPOP సేంద్రీయ ప్రమాణాలు & పద్దతుల ప్రకారం సేంద్రీయ ఉత్పత్తులను దృవీకరించి వినియోదారులకు అందుబాటులో ఉంచాలనే ఉద్యెశంతో, దేశంలోని వివిధ ప్రభుత్వ & ప్రైవేట్ రంగ సంస్థలకు సేంద్రీయ దృవీకరణ చేయుటకు గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది.

అరకొరగా సేంద్రీయ ఉత్పత్తుల పరీక్ష సౌకర్యాలు:

దేశం మొత్తం మీద గుర్తింపు పొందిన వివిధ ప్రభుత్వ & ప్రైవేట్ సేంద్రీయ దృవీకరణ సంస్థలు ఉన్నపటికి, సేంద్రీయ ఉత్పత్తులలో రసాయన అవశేషాలను పరీక్షించే టెస్టింగ్ ల్యాబ్ లు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక NABL గుర్తింపు పొందిన ల్యాబ్ ను ఏర్పాటు చేయటానికి కొన్ని కోట్ల మేర పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. అందుబాటులో ఉన్న కొన్ని ల్యాబ్ లలో కూడా ఒక సేంద్రీయ శ్యాంపిల్ టెస్టింగ్ చేయించడానికి వేలల్లో ఖర్చవుతుంది. దీనితో రైతుపై టెస్టింగ్ చార్జీల భారం అధికమవుతుంది. ఇందుకోసం సేంద్రీయ ఉత్పత్తుల్లో రసాయనాలను పరీక్షించే ల్యాబ్ లను సరిపడా ఏర్పాటు చేసి, కనీస చార్జీలతో సేంద్రీయ ఉత్పత్తుల టెస్టింగ్ చేస్తే, రైతుపై భారాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించవచ్చు.

మార్కెట్ లో యదేచ్చగా నకిలీ ఆర్గానిక్ ప్రాడక్ట్స్ అమ్మకాలు:

సేంద్రీయ ఉత్పత్తుల దృవీకరణ చేసే ప్రభుత్వ & ప్రైవేట్ రంగ సంస్థలు రైతులకు అందుబాటులో ఉన్నప్పటికి, బయట మార్కెట్ లో సేంద్రీయ ఉత్పత్తుల క్రయా విక్రయాలకు సంబందించి సరైన నాణ్యతా నియంత్రణ విధానం & ఎలాంటి రెగ్యులేటరీ వ్యవస్థ మాత్రం లేదు. దీనితో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని, సొమ్ము చేసుకోవాలని భావించిన దళారులుఆర్గానిక్ ఉత్పత్తులుఅని బోర్డులు పెట్టి, ప్యాకెట్ పైన స్వయంగా సర్టిఫైడ్ ఆర్గానిక్ అని ముద్ర వేసి మార్కెట్ లో యదేచ్చగా, విచ్చలవిడిగా ఉత్పత్తులను అమ్ముతూ, వినియోగదారులను మోసగించడం జరుగుతుంది.

మొదట్లో ఆసక్తి... రాను రాను స్వస్తి... :

నేటికీ మార్కెట్ లో నకిలీ ఆర్గానిక్ ఉత్పత్తులు అమ్మే వారిని నియంత్రించే ఒక పటిష్టమైన రెగ్యులేటరీ వ్యవస్థ లేకపోవడం వలన, కష్టపడి నష్టాలను భరించి నిజాయితీగా సేంద్రీయ వ్యవసాయం చేసి రైతు పండించిన ఉత్పత్తులకు సరైన గుర్తింపు, గిట్టుబాటు ధర లేక నిజమైన సేంద్రీయ రైతుల ఆశలు ఆవిరి అవుతున్నాయి. దీని వలన చాలా మంది రైతులు సేంద్రీయ దృవీకరణ సంస్థల దగ్గర దృవీకరణ చేయించుకోవటానికి కూడా ముందుకు రాకపోగా, మొదట్లో సేంద్రియ వ్యవసాయం వైపు కాస్త ఆసక్తి కనబరచినప్పటికి, రాను రాను సేంద్రీయ వ్యవసాయానికి స్వస్తి చెబుతున్నారు. కానీ కొంత మంది రైతులు ఇందుకు భిన్నంగా ఇష్టంతో, పట్టుదలతో, మొండిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ తమ చుట్టుపక్కలా ఉన్న పరిచయస్తులకు తాము పండించిన సేంద్రీయ ఉత్పత్తులను అమ్ముతూ లాభాలు అర్జీస్తున్నారు.

పటిష్టమైన మార్కెట్ రెగ్యులేటరీ వ్యవస్థ అవసరం

సేంద్రీయ పద్దతిలో రైతు పంట పండించినప్పటి నుండి, ప్రాసెసింగ్, ట్రేడింగ్ మరియు మార్కెట్ లో క్రయా విక్రయాల వరకు నాణ్యతా నియంత్రణ కోసం ఒక పటిష్టమైన సేంద్రీయ చట్టం, దానిని అమలు పరచే రెగ్యులేటరీ వ్యవస్థ ఏర్పాటు చేయటం వలన బయటి మార్కెట్ లో నకిలీ సేంద్రీయ ఉత్పత్తులకు చెక్ పెట్టడమే కాకుండా, నిజమైన సేంద్రీయ రైతులకు తోడ్పాటును అందించి, వినియోగదారులకు నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను అందించడంతో పాటు, సేంద్రీయ సాగును మరింత ప్రోత్సహించవచ్చు.

ప్రత్యేకమైన సేంద్రీయ ఎరువుల డీలర్ షాప్ ఏర్పాటు :

సేంద్రీయ సాగులో మార్కెటింగ్ తో పాటు రైతులు ఎదుర్కుంటున్న మరొక ముఖ్యమైన సమస్య సంప్రదాయ పద్దతిలో సేంద్రీయ ఎరువుల తయారు చేసుకోవటం. చాలా మంది రైతులు తమకున్న పొలంలో కొద్ది భాగంలోనే సేంద్రీయ వ్యవసాయం చేయటం జరుగుతుంది. దీనితో పాటు రైతులు తమకు తామే జీవామృతాలు, కాషాయాలు, అస్త్రాలు, ఇతర గో ఆధారిత ఎరువులను తయారుచేసుకునే శాస్త్రీయ పరిజ్ఞానం మరియు సౌకార్యాలు లేకపోవటం వలన, సేంద్రీయ ఎరువుల లభ్యత లోపించి, ఎరువుల విషయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఇందుకోసం సేంద్రీయ ఎరువులను తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించి, సాదారణ ఫర్టిలైజర్ & సీడ్ షాప్ మాదిరిగానే, మండల కేంద్రంగా ఒక ప్రత్యేకమైన సేంద్రీయ ఎరువుల డీలర్ షాప్ లు ఏర్పాటు చేస్తే, రైతుకు మార్కెట్ లో విరివిగా సేంద్రీయ ఎరువులు లభించి ఎలాంటి ఎరువుల సమస్య లేకుండా సులభంగా సేంద్రీయ వ్యవసాయం చేయగలదు.

మంచి ఫలితాలిస్తున్న సేంద్రీయ రైతు FPO’s :

దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే రైతులు సేంద్రీయ FPO’s ఏర్పాటు చేసుకొని సేంద్రీయ వ్యవసాయంలో మంచి ఫలితాలు పొందుతున్నారు. రైతులు జిల్లాల వారీగా తమ ప్రాంతంలో బాగా పండే పంటలను ఎంచుకొని FPO గా ఏర్పడి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. మొదట్లో రైతులు కొంత డబ్బును తమకు తామే FPO’s లో జమ చేసుకొని తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా FPO’s కి ప్రత్యేకంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి డబ్బులు ఇవ్వటమే కాకుండా, ఎరువుల కోసం ప్రత్యేకమైన స్కీమ్ ద్వారా రాయితీలను కల్పిస్తుంది. రైతులు పంట చేతికి వచ్చిన తరువాత ప్రాసెసింగ్ కోసం FPO’s ద్వారానే తమకు కావలసిన మిషనరీ స్వయంగా ఏర్పాటు చేసుకొని, ప్రాసెస్ చేసి, పండించిన పంటలకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను ఏర్పరచుకొని బయటి మార్కెట్ లో మంచి ధరలకు ట్రేడర్లకు అమ్ముకుంటున్నారు. విధంగా సేంద్రీయ రైతు FPO’s ఏర్పాటు చేసి సేంద్రీయ వ్యవసాయన్ని మరింత ప్రోత్సహించవచ్చు.

మార్కెటింగ్ కోసం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలి :

రోజు రోజుకి సేంద్రీయ ఉత్పత్తులకు వస్తున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని రైతు నుంచి సేంద్రీయ ఉత్పత్తులను కొని, ప్రాసెసింగ్ చేసి, వినియోగదారులకు అందించే చిన్న చిన్న ట్రేడింగ్ & మార్కెటింగ్ కంపెనీలు ఆసక్తితో ముందుకు వస్తున్నారు. ప్రభుత్వాల నుంచి ఇలాంటి వారికి పెట్టుబడి తదితర అంశాలలో తోడ్పాటును అందించి, ప్రత్యేక స్కీముల ద్వారా రాయితీలు కల్పిస్తే సేంద్రీయ రైతులకు మంచి మార్కెటింగ్ సదుపాయాన్నే కల్పించడంతో పాటు, రైతుకు తాము పండించిన పంటలు ఎలాంటి ఆలస్యం లేకుండా అమ్ముడపోయి, బయటి మార్కెట్ లో రైతు తనకు నచ్చిన కంపెనీలకు తమ ఉత్పత్తులు అమ్ముకొని మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది.

విధంగా సేంద్రీయ వ్యవసాయంలో రైతు పంట పండించినప్పటి నుండి, దృవీకరణ, ప్రాసెసింగ్, ట్రేడింగ్, మార్కెటింగ్, చివరికి వినియోదారుడు కొనేవరకు ఉత్పత్తుల నాణ్యతా నియంత్రణ కోసం ఒక పటిష్టమైన చట్టం, మార్కెటింగ్ & రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది, అప్పుడే సేంద్రీయ ఉత్పత్తులకు బాగా డిమాండ్ పెరిగి, రైతుకు లాభం చేకూరి, సేంద్రీయ వ్యవసాయం సుస్థిరతను సాదించడమే కాకుండా, మంచి నాణ్యమైన & నమ్మకమైన సేంద్రీయ ఉత్పత్తులను వినియోగదారునికి అందించే అవకాశం ఉంటుంది.

                                                                 

విశ్లేషణ

ఎడిటర్ డెస్క్, రైతుముచ్చట


Post a Comment

0 Comments