Breaking News
Loading...

ఏంటీ ఈ HT పత్తి విత్తనం..? రైతులు ఎందుకు ఈ రకం పత్తిని సాగు చేయవద్దు...?? దీనిని గుర్తించడం ఎలా..??


హైదారాబాద్, రైతు ముచ్చట : దీనినే BG-III/BT-III పత్తి అని కూడా అంటారు, HT (Herbicide Tolerant) పత్తి అనేది గ్లైఫోసేట్ కలుపుమందును తట్టుకొని ఉండే జన్యుమార్పిడి పత్తి రకం, ఈ రకం పత్తి పంట సాగు చేసినప్పుడు పొలంలో కలుపు మందు పిచికారి చేస్తే కేవలం కలుపు మాత్రమే చనిపోయి, పత్తి మొక్కకు ఏలాంటి ప్రమాదం ఉండధు, అందువల్ల రైతులు విపరీతంగా కలుపు మందు కొట్టే అవకాశం ఉంది. ఇలా HT పత్తి పంటకు కలుపు మందును తట్టుకునే శక్తి ఉందనీ కొందరు దళారులు రైతులకు విచ్చలవిడిగా ఈ పత్తి విత్తనాలను అంటగడుతున్నారు.

HT పత్తికి మన దేశంలో అనుమతి లేదు

కలుపు మందును తట్టుకునే ఈ HT/BG-III పత్తి రకాన్ని అమెరికాకు చెందిన మోన్సాంటో కంపెనీ కనుగొన్నది. రౌండప్ రెడీ ఫ్లేక్స్ (RRF) రూపంలో ఆ దేశంలో అమ్ముతున్నది. అయితే ఇండియాలో కూడా ఈ పత్తి రకాన్ని ప్రవేశపెట్టాలని తమ వ్యాపార బాగస్వామి అయిన మరొక విత్తన కంపెనీ అయిన మహికో ద్వారా భారత ప్రభుత్వాన్ని అనుమతులు కోరింది. ఫీల్డ్ ట్రైయల్స్ లో ఇంకా విశ్లేషణలో ఉన్నందున, అధెవిధంగా దీనివలన కలిగే కొన్ని అనర్థాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేధు.

HT పత్తి వలన కలిగే నష్టాలు

Genetic Engineering Approval Committee (GEAC) అనుమతి లేని, HT పత్తి విత్తనాలు రైతులు వాడటం వలన. గ్లైఫోసెట్ అనే కలుపు మందు వాడకం పెరిగి, వాతావరణం కలుషితం అవ్వడమే కాకుండా, జీవ వైవిద్యం దెబ్బతిని, ఇతర పత్తి హైబ్రిడ్ లు కూడా కలుషితం అవుతాయి.

అధెవిధంగా పత్తి మొక్క మరియు కలుపు మొక్క మధ్య క్రాసింగ్ జరిగి కలుపు మందును తట్టుకునే జన్యువులు కలుపుమొక్కలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది, తద్వారా కలుపు మొక్కలు కూడా కలుపు మందు తట్టుకునే స్వభావాన్ని ఏర్పరచుకొని సూపర్ వీడ్స్ గా మారే అవకాశం ఉంటుంది.

అధెవిధంగా విపరీతంగా కలుపు మందును వాడటం వలన కూడా రాను రాను కలుపు మొక్కలు కూడా సాదారంమగా కలుపు మందును తట్టుకునే శక్తిని ఏర్పరచుకుంటాయి.

తెలంగాణ మార్కెట్ లోకి HT పత్తి విత్తనాలు మరింత వచ్చే అవకాశం

తెలంగాణ ప్రభుత్వం రానున్న వానాకాలంలో పత్తి విస్తీర్ణాన్ని మరొక పది లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించింది. దీనితో ఈ వానాకాలంలో తెలంగాణాలో దాదాపు 60 లక్షల ఎకరాలలో పత్తి సాగు అయ్యే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్నా దళారులు మార్కెట్ లో కల్తీ పత్తి విత్తనాలతో పాటు, HT పత్తి విత్తనాలు అమ్మే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పత్తి విత్తనాలను మహారాష్ట్ర, గుజరాత్ రాష్టాల నుంచి తీసుకవచ్చి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో రైతులకు అంటగడుతున్నారు. ముఖ్యంగా అధికారుల కంట పడకుండా BG-III పత్తి విత్తనాన్ని BG-II ప్యాకెట్ ప్యాక్ చేసి అమ్ముతున్నారు. గడిచిన వానాకాలం సీజన్ లో కూడా అనధికారంగా అధిక మొత్తంలో ఈ HT పత్తి విత్తనాలను BG-II విత్తనం రూపంలో రైతులకు అమ్మినట్లు సమాచారం.

HT పత్తి విత్తనాన్ని గుర్తించడం ఎలా...?

క్షేత్ర స్థాయిలో పలాన పత్తి విత్తనం HT పత్తి విత్తనమా..? కాదా..? అని తెలుసుకోవడానికి ఇమ్యూనో స్ట్రిప్ పద్దతి ద్వారా ప్రాథమికంగా అప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇమ్యూనో స్ట్రిప్ టెస్టింగ్ కిట్ లో ఐస్ బాక్స్ లో ఒక టెస్ట్ ట్యూబ్, పేపర్ స్ట్రిప్, టెస్టింగ్ సొల్యూషన్ ఉంటాయి. ఈ పద్దతిలో సీడ్ సాంపుల్ ను మెత్తగా నూరి ఆ పొడిని టెస్ట్ ట్యూబ్ లో వేసి, ఆ ట్యూబ్ లో టెస్టింగ్ సొల్యూషన్ వేయాలి, ఆ తరువాత ట్యూబ్ లో పేపర్ స్ట్రిప్ పెట్టాలి. ఒకవేళ HT విత్తనం అయితే కంట్రోల్ లైన్ మరియు టెస్ట్ లైన్ అనే రెండు లైన్స్ పేపర్ స్ట్రిప్ పైన కనబడతాయి. HT జన్యువు లేకుంటే కేవలం కంట్రోల్ లైన్ మాత్రమే కనబడుతుంది. అయితే ఈ ఇమ్యూనో స్ట్రిప్ పద్దతిన అప్పటికప్పుడు HT జన్యువు ఉందా లేదా అని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినప్పటికి, చివరగా ల్యాబ్ లో DNA ను తీసి జన్యు స్వచ్ఛత పరీక్షించి HT జన్యువును నిర్దారించవలసిన అవసరం ఉంటుంది.

Post a Comment

0 Comments