Breaking News
Loading...

అధిక వర్షాల నేపథ్యంలో రైతులకు సూచనలు

తెలంగాణ, రైతుముచ్చట: రాష్ట్రంలో గత వారం రోజుల నుండి అడపాదడపా కురుస్తున్న వర్షాల ప్రభావం వలన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న పత్తి, వరి లాంటి పంటలలో రైతులు నష్టపోకుండా తగు జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఉన్నది.

వరి :
ప్రస్తుతం కొంత వరి నారు మడి దశలో, మరి కొంత నాట్లు అయిపోయి పిలక దశలో ఉంది. నారు మడి దశలో అయితే నారు తెల్లబడకుండా ఉండేందుకు లీటరు నీటికి 20 గ్రాముల యూరియా లేదా 5 గ్రాముల 19:19:19 ను ఐదు రోజుల వ్యవదిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. ఒకవేళ నాట్లు పూర్తి అయ్యి పిలకలు వేసే దశలో ఉంటే, వరి పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి పొలంలో వెంట్రుక మందం నెర్రెలు వచ్చే వరకు ఆరబెట్టాలి. దీనితో పిలకలు నష్టపోకుండా కోలుకొని త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది.

పత్తి :
అధిక వర్షాల వలన పత్తి చేనులో మొక్కలు అక్కడక్కడ వడలిపోయి చనిపోయినట్లు కనిపించడం జరుగుతుంది. పొలంలో రోజుల తరబడి వర్షపు నీరు నిల్వ ఉండడం వలన సరైన మోతాదులో మొక్కకు పోషకాలు అందకపోవటం ఇలా అవుతుంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే చేనులోని నీటిని కాలువలు, బోదెల ద్వారా తీసివేసి, ఒక లీటర్ నీటిలో 3 గ్రాములు కాపర్ ఆక్సీ క్లోరైడ్ (బ్లైటాక్స్) ను కలిపి చెట్ల మొదలులో పోయాలి. మళ్ళీ మూడు రోజుల తరువాత నీటిలో కరిగే రసాయన ఎరువులు అయినా 19:19:19 లేదా 13:0:45 ను లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి. దీనితో మొక్కకు పోషకాలు లభించి కొత్త చిగుర్లు వేసే అవకాశం ఉంటుంది.

Post a Comment

0 Comments